Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి ఇన్నింగ్స్ లో 67 ఆలౌట్... సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతం చేసి చూపించిన ఇంగ్లాండ్

  • యాషెస్ సిరీస్ లో నమ్మశక్యం కాని విజయం
  • వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్
  • ఒక్క వికెట్ తేడాతో ఆసీస్ ను ఓడించిన ఇంగ్లాండ్
సాధారణంగా టెస్ట్ క్రికెట్ లో తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిన జట్లు మ్యాచ్ లో కోలుకోవడం చాలా అరుదైన విషయం. కోలుకుని మ్యాచ్ గెలిస్తే అది నిస్సందేహంగా అద్భుతమే. చాన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాపై కోల్ కతాలో భారత్ అలాంటి అద్భుతమే చేసింది. ఇప్పుడు యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ అలాంటి నమ్మశక్యం కాని విజయం సాధించింది. అది కూడా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 67 పరుగులకు ఆలౌటైన జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 359 పరుగుల విజయలక్ష్యాన్ని నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఛేదిస్తుందని ఎవరైనా ఊహించగలరా? కానీ, ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా మొండిపట్టుదలతో ఆడిన స్టోక్స్ చివరి వికెట్ అండతో ఇంగ్లాండ్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. స్టోక్స్ 11 ఫోర్లు, 8 సిక్స్ ల సాయంతో 135 పరుగులు చేసి ఒంటిచేత్తో ఇంగ్లాండ్ గెలుపును లిఖించాడు. మొదట్లో బౌలర్ల ఆధిపత్యం సాగడం చూసి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును చుట్టేయగలమని భావించిన ఆసీస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లీష్ జట్టు చివరి వికెట్ పడగొట్టలేక కంగారూ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.

మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 179 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది.  అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 359 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. అయితే రూట్ (77), డెన్లీ (50) ఓ మోస్తరు పోరాటం సాగించగా, బెన్ స్టోక్స్ రంగప్రవేశంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

బ్యాటింగే రాని మార్క్ లీచ్ (1)ను అడ్డంపెట్టుకుని కంగారూల పనిబట్టాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. ఈ సిరీస్ లో ఇంకా రెండు టెస్టులు మిగిలున్నాయి. తొలి టెస్టులో ఆసీస్ నెగ్గగా, రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది.
Ashes
England
Australia
Ben Stokes

More Telugu News